మెటా కీలక నిర్ణయం.. ఫీజుల బాటలో ఫేస్‌బుక్, ఇన్‌స్టా, వాట్సాప్.. కార‌ణ‌మిదే!

  • ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల కోసం పెయిడ్ 'ప్లస్' సేవలు ప్రారంభం
  • భారత్‌లో నెలకు రూ.99కే అందుబాటులో ప్రీమియం ఫీచర్లు
  • ఏఐపై భారీ పెట్టుబడుల నేపథ్యంలో ఆదాయ మార్గాలను పెంచుకునే వ్యూహం
  • ప్రాథమిక సేవలు యథాతథంగా ఉచితంగానే కొనసాగుతాయని మెటా స్పష్టీకరణ
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లకు సంబంధించి మాతృసంస్థ 'మెటా ప్లాట్‌ఫామ్స్' ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఉచితంగా అందిస్తున్న ఈ యాప్‌లలో అదనపు ఫీచర్ల కోసం ఐచ్ఛిక పెయిడ్ సబ్‌స్క్రిప్షన్లను అందుబాటులోకి తెచ్చింది. 'ప్లస్' పేరుతో వస్తున్న ఈ కొత్త సేవలు మే నెలాఖరు నుంచి ప్రపంచవ్యాప్తంగా దశలవారీగా అమల్లోకి వచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో వేల కోట్ల డాలర్లు పెట్టుబడిగా పెడుతున్న తరుణంలో, కేవలం ప్రకటనల ఆదాయంపైనే ఆధారపడకుండా కొత్త ఆదాయ మార్గాలను సృష్టించుకోవడమే లక్ష్యంగా మెటా ఈ అడుగు వేసింది.

భారత్‌లో రూ.99కే ప్రీమియం ప్లాన్లు
ఈ కొత్త ప్లాన్ల ప్రకారం, 'ఇన్‌స్టాగ్రామ్ ప్లస్', 'ఫేస్‌బుక్ ప్లస్' కోసం నెలకు సుమారు 3.99 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. భారత్‌లో దీని ధరను ప్రారంభ ఆఫర్లతో కలిపి సుమారు రూ.99గా నిర్ణయించారు. అదేవిధంగా 'వాట్సాప్ ప్లస్' సబ్‌స్క్రిప్షన్ కోసం నెలకు 2.99 డాల‌ర్లు (భారత్‌లో సుమారు రూ.99) చెల్లించాలి. ఈ ప్లాన్లు తీసుకున్న యూజర్లకు స్టోరీల నిడివి పెంచుకోవడం, ప్రొఫైల్ కస్టమైజేషన్, సూపర్ రియాక్షన్లు, సీక్రెట్ స్టోరీ వ్యూయింగ్, మరిన్ని చాట్‌లను పిన్ చేసుకునే సౌలభ్యం వంటి పలు ప్రీమియం ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి. అయితే, ప్రస్తుతం ఉన్న ప్రాథమిక సేవలు యథాతథంగా అందరికీ ఉచితంగానే కొనసాగుతాయని, వాటిలో ఎలాంటి మార్పు ఉండదని మెటా స్పష్టం చేసింది.

ఏఐ పెట్టుబడుల కోసమే ఈ వ్యూహం
మెటా ఈ ఏడాది తన మూలధన వ్యయాన్ని ఏకంగా 125 బిలియన్ డాల‌ర్ల‌ నుంచి 145 బిలియన్ డాల‌ర్ల‌కు పెంచింది. ఈ భారీ మొత్తాన్ని ప్రధానంగా ఏఐ డేటా సెంటర్లు, కంప్యూటింగ్ పవర్, ఇతర మౌలిక సదుపాయాల కోసమే కేటాయిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రకటనలకు అతీతంగా స్థిరమైన ఆదాయాన్ని సమకూర్చుకోవడం కంపెనీకి అత్యవసరంగా మారింది. ఇటీవలే భారత్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో కలిసి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఒక ఏఐ డేటా సెంటర్‌ను అభివృద్ధి చేసేందుకు మెటా ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం.

ఈ కొత్త సబ్‌స్క్రిప్షన్ల ద్వారా దీర్ఘకాలంలో కంపెనీకి గణనీయమైన ఆదాయం లభించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యూజర్లు కోరుకుంటున్న ఎన్నో మెరుగైన ఫీచర్లను ఈ 'ప్లస్' సేవల్లో అందిస్తున్నామని మెటా ప్రొడక్ట్ హెడ్ నవోమి గ్లీట్ తెలిపారు. త్వరలో వ్యాపారాలు, క్రియేటర్ల కోసం, అలాగే నెలకు 19.99 డాల‌ర్ల‌ వరకు ఉండే అధునాతన ఏఐ ఫీచర్ల కోసం కూడా ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్లను పరీక్షిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

అయితే, ఈ కొత్త పెయిడ్ ప్లాన్లపై నిపుణుల నుంచి, యూజర్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఏఐపై చేస్తున్న భారీ ఖర్చును సమర్థించుకోవడానికి మెటాకు ఇలాంటి ఆదాయ మార్గాలు అవసరమని 'టెకార్క్' నిపుణుడు ఫైసల్ కవూసా అభిప్రాయపడగా, ఏఐ పెట్టుబడులపై బలమైన రాబడి వచ్చే వరకు ఇవి కేవలం ఒక 'స్టాప్‌గ్యాప్' ఏర్పాటు మాత్రమేనని ఏఐ నిపుణుడు శ్రీనివాస్ పద్మనాభుని పేర్కొన్నారు. పవర్ యూజర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు మినహా సాధారణ యూజర్లు డబ్బు చెల్లించి ఈ సేవలు పొందేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చని ప్రాథమిక స్పందనలు సూచిస్తున్నాయి.

Meta
Facebook Plus Subscription
Instagram Plus Price India
WhatsApp Plus Features
Meta AI Investment
Social Media Paid Plans

More Telugu News